Thursday 25 July 2019

ఛాయ్ విలేజ్


సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా చల్లగాలికి వెల్దామని బయటకు వెళ్తే అక్కడ 'ఛాయ్ విలేజ్' అనే బోర్డు ఒకటి కనపడింది. ఆ పేరు చూడగానే నాకు ఒక ఆలోచన వొచ్చింది.. ఆ ఆలోచన నుండి అక్షర రూపంలో బయటకు వొచ్చినదే ఈ ఛాయ్ విలేజ్..



ఆ ఊరు 'టీ'కి ప్రత్యేకం..'టీ' కే ప్రత్యేకం..అందుకే ఊరి పొలిమేర దగ్గర ఛాయ్ విలేజ్ ముఖద్వారానికి రెండు వైపులా 10 అడుగుల ఎత్తులో ఫ్లాస్క్ ని పోలిన స్తంభాలు ఉంటాయి..ఆ స్తంభాలపైన మసీదు పై కప్పుతో పోలిన ఆకారంలో 'ఛాయ్ విలేజ్' అని సిమెంట్ అక్షరాలతో రాసి ఉన్న ముఖద్వారం స్వాగతం పలుకుతుంది. ఊరి లోపల చిన్న చిన్న ఇళ్ళు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. రోడ్డు వెంబడి చెట్ల కింద ఏర్పాటు చేయబడిన చక్కని టీ కప్పు ఆకారపు కుర్చీలు, కాఫీ రంగు అద్దుకొని దర్శనమిస్తుంటాయి ఛాయ్ విలేజ్ లో. ఆ ఊరి నైపుణ్యం చెప్పడానికి, వారి అలవాట్లను తెలుసుకోవడానికి ఈ కుర్చీల అల్లికే ఒక ఉదాహరణ. అన్నట్లు చెప్పడం మరిచాను ఈ ఊరిలో కొంతమందికి టీ ల పేర్లు, మరికొంతమందికి కాఫీ ల పేర్లు ఉంటాయి. ఇది ఇక్కడ సర్వ సాధారణం మరి.

తెలుగిళ్ళలో భోజన సమయంలో ఆవకాయ, కూర, చారు, పెరుగు లాంటి లొట్టలేసుకుంటు తినే రకాలు ఉన్నట్లు..ఆ ఊరిలో కూడా ఆస్వాదిస్తూ తాగే ఐదు రకాల 'టీ' లు ఆ ఛాయ్ విలేజ్ ప్రత్యేకత.  4వ శతాబ్దంలో 'టీ' ని కనిపెట్టిన చైనా వైద్యుడే ఆ ఊరి గుళ్లలో కొలువుండే దేవుడంటే అతిశయోక్తి కాదు.  ఇక పండగ వొచ్చిందంటే గుమగుమలాడే మసాలా ఛాయ్ లు, నోరూరించే అల్లం 'టీ' ల గురించి చెప్పాల్సిన పనే లేదు.. అలాంటి ఛాయ్ విలేజ్ లో కూడా ఒక ప్రేమ కథ ఉంది.. నీటిని మరిగించి మరిగించి టేస్ట్ కోసం ఎదురుచూసే 'టీ' సాంప్రదాయం ఆ ఊరి ప్రజలు తాగే టీ ల వల్ల వంటబట్టింది అనుకుంటా..అందుకే వారు ప్రేమించుకుంటూ, హద్దులను మించుకుంటూ వారి కమ్మనైన కాఫీ లాంటి ప్రేమను తమ తల్లిదండ్రులకు చెప్పడానికి ఎదురుచుస్తూనే వున్నారు.

ఇలాంటి విచిత్రపు ఊరిలో ప్రేమ కథా అనుకుంటున్నారా?? దానికి 'టీ' కి ఉన్నంత చరిత్ర ఉంది.  కొన్ని సంవత్సరాల క్రితం.. ఫ్లాష్ బ్యాగ్ అనగానే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో స్క్రీన్ ఒకటి ఓపెన్ అయ్యి, ఏమని చెప్పాలి.. ఎవరు పేరు చెపితే..అలాంటివి ఏమి లేవు కానీ.. ఈ ప్రేమ కథలో హీరోగా చెప్పుకోబడే ఊలాంగ్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఛాయ్ విలేజ్ ప్రత్యేకతను విని చూడటానికి వొచ్చారు.. వొచ్చి చూసిపోకుండా ఇక్కడే స్థిరపడి హీరోయిన్ గా చెప్పుకుంటున్న బ్లాక్ టీ ( హీరోయిన్ పేరే బ్లాక్ టీ ) వారి తాగి చూడరా రుచి అనే కాఫీ షాపుకి ఎదురుగానే అమృతపు రుచి మీ సొంతం కాఫీ షాపును మొదలెట్టారు.
అప్పటికే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగే తాగి చూడరా రుచి షాపు వీరి రాకతో మూడు పువ్వులు మూడు కాయలుగా మారింది. ఎదురెదురు షాపుల మధ్య పోటీ నెలకొంటే..ఎదురెదురుగా ఉంటున్న ఊలాంగ్, బ్లాక్ టీ మధ్య ప్రేమ పుట్టింది. ఇక ఛాయ్ విలేజ్ ప్రత్యేకత రోజు రోజుకు పక్క రాష్టాలకు కూడా పాకుతూ పోతుంది.. దీంతో ఛాయ్ విలేజ్ లోనే పెద్దవారిగా పేరు తెచ్చుకున్న ఈ ఎదురెదురు షాపుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి. పక్క రాష్టాల నుండి వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు ఈ ఛాయ్ విలేజ్ కి తరలి రావడం మొదలయింది.. తమ రాష్టాలలో కూడా ఎన్నో వందల కాఫీ షాపులు వున్నా, ఆ షాపుల్లో ఒక్క కాఫీకి వందలకు వందలు వసూలు చేస్తున్నా వాటన్నింటిని వొదిలి ఈ ఊరి ఛాయ్ తాగాలని, ఈ ఊరి వాళ్ళతో ఒక ఛాయ్ షాపు పెట్టించాలని కాచుకుకూర్చున్న వారెందరో..

ఇలా ఛాయ్ విలేజ్ కీర్తి, ప్రతిష్టలు పక్క దేశాలకు కూడా పాకుతుండగానే.. ఏడాదికొకసారి ఛాయ్ విలేజ్ జరుపుకునే  భళా ఛాయ్ ఉత్సవం వొచ్చింది..సంవత్సరానికి ఒకసారి వొచ్చే ఈ ఉత్సవాన్ని ఈ ఊరి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.. విచిత్రం ఏంటంటే.. ఏడాది పొడవునా రకరకాల టీ లు వుండే ఈ ఊరిలో..ఆ రోజు మాత్రం టీ వాసన కూడా కనపడదు..
గంటలు గడుస్తున్నా కొద్ది ఉత్సవం ఊపు జోరందుకుంది..పగలు మొత్తం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన వారు..రాత్రి కాగానే ఆ కాలక్షేపానికి తోడు ఖరీదైన బాటీల్లతో జత కట్టి సిప్పు, సిప్పులో స్వర్గాన్ని వెతుక్కుంటున్నారు. సరిగ్గా అప్పుడే దూరంగా ఉన్న గడియారం 8 గంటలు కొట్టింది.. తాగిన మైకంలో గడియారం శబ్ధం కర్నకఠోరంగా వినపడిందో ఏమో కాని.. కోపంతో పంచ కట్టుకున్న స్థూలకాయుడు ఒకడు లేచి కోపంగా ఆ శబ్ధం చేసిన గడియారం వైపు బయలుదేరాడు.. గడియారం దగ్గరకి చేరుకొని దాన్ని పగలగొట్టడానికి చేతిలో పెట్టుకోగానే..అతనికి సన్నని గునుగుడు ఒకటి ఆ పక్కనే ఉన్న ఇంటి నుండి వినపడింది.. వెంటనే తొంగి చూసాడు.

ఈ ఉత్సవంలో సంబంధం లేకుండా ఊలాంగ్, బ్లాక్ టీ లు ప్రయివేట్ గా మాట్లాడుకోవడం పబ్లిక్ గా బయటపడింది. అందులోనూ చూసిన స్థూలకాయుడు బ్లాక్ టీ వాళ్ళ నాన్న మరి.  దీంతో ఆ ఊరిలో రావణకాష్టం మొదలయింది.. సలసల మరిగే టీ, పొగలు కక్కినట్టు.. ఇరు కుటుంబాల పెద్దలు కోపంతో నిప్పులు కక్కారు.
వీళ్ళు పెళ్లి అన్నారు..
వాళ్ళు పగ అన్నారు..
వీళ్ళు ప్రేమించుకున్నాం అన్నారు..
వాళ్ళు మర్చిపోండి అన్నారు.
ప్రేమ ఏమైనా మర్చిపోటానికి ఒక వస్తువా ??  టీ ఎడిక్ట్ అయినట్లు వాళ్ళ మనసులలో ప్రేమ ఎడిక్ట్ అయిపోయింది మరి. ఊపందుకున్న ఉత్సవం కాస్త వాడివేడిగా ముగిసింది.

మరుసటి రోజు... వేకువజామున పక్క గ్రామల నుండి వొచ్చిన కొన్ని వందల లీటర్ల పాలను పెద్ద గంగాళం లాంటి పాత్రలో వేడిచేస్తూ వున్నారు ఆఊరి వాళ్ళు.. ఉదయం కావున..రాత్రి మొత్తం సేద తీరిన సల సల మరిగిపోయే డికాసిన్( నలుపు రంగు లో ఉంటుంది) తెల్లవారగానే తనకు అందాన్ని ఇచ్చే పాలకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఇరు ఇళ్లలో ఉన్న ప్రేమికులు ఒకరినొకరు చూసుకోవడాని, కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు.

కాలగమనంలో రోజులు చిరుతలా పరిగెడుతున్నాయి.. ఈ ఛాయ్ విలేజ్ లో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. వంద కుటుంబాలు వున్నా ఏ ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ ఆస్తులు కానీ స్థలాలు కానీ లేవు.. వారికి ఉన్న ఆస్థి అల్లా ఒక్క ఈ ఛాయ్ విలేజ్.. అందులో ఒకే కుటుంబంలా వుండే మనుషుల ఆప్యాయతలే.. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటుంది.. ఆస్తులు లేవు.. భూములు లేవు మరి వారి బ్రతుకుతెరువు ఏంటి?? వారికి సంపాదన ఎలా అనే విషయం గురించి..

సంపాదన.. ఇది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు మితిమీరి మరీ సంపాదిస్తుంటే..మరికొందరు రోజులు గడిస్తే చాలు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సంపాదిస్తుంటారు.. దీన్నే పరిమిత సంపాదన, అపరిమిత సంపాదన అంటారు. ఈ పరిమిత సంపాదన, అపరిమిత సంపాదనలు కూడా రెండు కోణాల్లో ఉంటాయి..
అంబానీని మనం చూసి అపరిమితంగా డబ్బు సంపాదిస్తున్నాడు అనుకుంటాం..ఇది ఒక కోణం..కానీ అంబానీ కోణంలో మాత్రం తాను సంపాదించే సంపాదనకు రెట్టింపు చెయ్యాలి..ఇంకా నేను పరిమితంగానే సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నాడేమో ఇది ఇంకో కోణం..
ఇక ఛాయ్ విలేజ్ సంపాదన విషయానికి వస్తే.. ఛాయ్ విలేజ్ కు దక్షిణ దిక్కున 8 కిలోమీటర్ల దూరంలో దూద్లా అనే పట్టణం ఉంది.. విజయనగరం అంత పెద్ద పట్టణం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి.. ఛాయ్ విలేజ్ లో వుండే 100 కుటుంబాల్లో 70 కుటుంబాలు ఈ ఛాయ్ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ 70 కుటుంబాల్లో 30 కుటుంబాలు ఈ పట్టణానికి వొచ్చి ఛాయ్ అమ్ముకుంటారు..
మిగిలిన కుటుంబాలు కూడా ఇలానే పక్క నన్ను పట్టణాలకు, పెద్ద గ్రామాలకు వెళ్లి ఛాయ్ అమ్ముకుంటు జీవనం సాగిస్తుంటారు. వీరందరు ఛాయ్ అమ్మే దగ్గర ఒకటే బోర్డు ఉంటుంది.. ఇది ఛాయ్ విలేజ్ షాపు. అని ఆ పదం చాలు రోజుకు ఛాయ్ అమ్మగా 300 లాభం రావటానికి.. ఆ లాభం చాలు ఆ ఊరి వాళ్ళకి సంతోషంగా బ్రతకడానికి. ఇదే వీరి వృత్తి..

ఛాయ్ విలేజ్ కి పెద్ద మనుషులయినా, ప్రత్యర్థులైన ఆ రెండు కుటుంబాలే.. ఆ రెండు కుటుంబాల హవా సాగుతున్న ఆ ఊరిలో మూడవ వ్యక్తి అడుగు పడింది..ఆ అడుగుతో ఊరు అట్టుడుకిపోయింది..

తర్వాత ఏం జరిగిందో ఛాయ్ విలేజ్ సెకండ్ ఎపిసోడ్ లో చూద్దాం..

Thursday 14 February 2019

వాలెంటైన్స్ డే ప్రేమ కథ


అటు మెట్రో స్టేషన్ ముద్దులకు,ఇటు భజరంగ్ దళ్ యొక్క నియమాలకు సంబంధం లేకుండా భలే లవ్ స్టోరీ కదా అని పాఠకులు తమ మనస్సులో అనుకోవడానికి చేస్తున్న ఒక చిరు ప్రేమ  ప్రయత్నం ఇది..

ఇది ప్రేమ కథే కానీ దేవదాసు, పార్వతి ప్రేమ కథ లాంటిది మాత్రం కాదు అయినా ప్రేమ గురించి మాట్లాడితే దేవదేసు.పార్వతి ప్రేమ కథని ఉదాహరణగా చెపుతారు ఏంటి వాళ్ళ ప్రేమ కథని లవ్ ఫెయిల్యూర్ కి ఉదాహరణగా చెప్పాలి కానీ..

సరే, విషయానికి వొస్తే.. 

ఒక మారుమూల పల్లెటూరు.. అది పల్లెటూరే కదా అని తీసిపడేయకండి ఒక సంఘటన 10 శాతం జరిగితే దానిని వారి క్రియేటివిటీ తో 90 శాతం కల్పించి చెప్పేంత వేగం ఆ ఊరి సొంతం.. ఆ ఊరి ముందు టీవీ 9 కూడా సరితూగదు..

ఇద్దరు అబ్బాయిలు కలిసి తిరిగితే తాగుబోతులు..
అదే ఒక అమ్మాయి, అబ్బాయి  మాట్లాడుకుంటే వారి మధ్య ప్రేమ వుంది అనుకునేంత కఠినమైన మనుషులు అక్కడ కోకొల్లలు..

ఇలాంటి చరిత్ర కలిగిన ఊరికి భయపడి తన ఇష్టాలను, ఆనందాలను దూరం చేసుకొని స్నేహితులను విడిచి ఒంటరి తానాన్ని తన మజిలీగా,మౌనాన్ని తన స్నేహితుడుగా చేసుకున్న ఒక యువకుని ప్రేమ కథ ఇది..

ఎన్ని ద్వేషాలు, పగలు వున్నా ఊరిలో జరిగే వేడుకలను అందరు కలసి  చేసుకోవడం ఆ ఊరికున్న ఒక మంచి లక్షణం.. ఆ మంచి లక్షణమే ముందు,ముందు మన హీరో ప్రేమకు కారణం అవుతుంది.. సంవత్సరంలో ఒక అమావాస్య రోజున ఆ చీకటిలో అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఏర్పాటు చేసిన నాటకాన్ని చూస్తూ ఆ రాత్రి మొత్తం జాగారం చేస్తుంటారు..

అమావాస్య మీద చందమామ అలిగి చీకటిని చాపలా భూమి మీద పరిచి తానూ మబ్బుల చాటుకు పోయిన ఆ అమావాస్యపు మసక చీకటిలో నాకు పౌర్ణమిని పరిచయం చేసిన ఒక అందమైన అమ్మాయిని చూశాను.. చూడటం ఏంటి అనుకోకుండా యురేనియం లాంటి నేను న్యూక్లియర్ లాంటి కటిక చీకటిలో న్యూట్రాన్ లాంటి తనను బలంగా ఢీకొట్టడం వలన నాలో అమెరీషియం లాంటి ప్రేమ పుట్టింది.. 

22 సంవత్సరాలు మౌనంతో స్నేహం చేస్తున్న నాకు ఇకపై ప్రేమని భాగస్వామిగా చేసుకోవాలనే కోరిక పుట్టింది..

ప్రేమ..!  రెండు అక్షారాల పదం 
               సఫలమైతే మూడు అక్షరాల ఆనందం 
                విఫలమైతే మూడు అక్షరాల విచారం 

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో  ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేదు.. నాలో ఆ ప్రేమని పరిచయం చేసిన అమ్మాయి పేరు అకీర.. మనం రోజు చూస్తున్న అమ్మాయే ఒక్కోసారి అందంగా కనపడుతుంది,ఒక్కోసారి మాములుగా కనపడుతుంది.. నేను చిన్న తనం నుండి తనని చూస్తూనే వున్నాను కానీ ఆ రోజు దీపాల కాంతుల్లో చందమామలా కనపడింది.. అలా నాలో ప్రేమ పుట్టింది.

మన ఊరి సంగతి అగమ్యగోచరం..
మరి తనతో ఎలా మాట్లాడాలి..
ఎలా నా ఫీలింగ్స్ ని ఆమెతో పంచుకోవాలి.. రోజులు గడుస్తున్నాయి దేని మీద ద్రుష్టి కేంద్రీకరించపోతున్నాను..

ఒక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నాకు ఫేస్బుక్ లో ఆమె పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ తో ఛాన్స్ వెతుక్కుంటూ వొచ్చింది.. ( ఆమె అప్పుడే ఫేస్బుక్  వాడటం మొదలుపెట్టింది).. అలా తన ఇష్టాఇష్టాలను తెలుసుకున్నాను.. రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత ఒక వాలెంటైన్స్ డే రోజున తన మీద ప్రేమని బయట పెట్టడం జరిగింది...

తన దగ్గర నుండి ఏ రెస్పాన్స్ లేదు.. మెసేజ్ లు , ఫోన్ లు అన్ని బ్యాండ్..

INFACT  బ్లాక్ చేసిని అని చెప్పొచ్చు.. అలా రోజులు దారుణంగా గడుస్తున్నాయి

ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తను ఊరిలో ఒక ఫంక్షన్ లో ఎదురుపడింది..

ప్రేమ విషయం ప్రస్తావించకుండా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నాను.. మేము మాట్లాడుకోవడం చూసి అంతలోనే వార్త ఊరి నలుదిశలా వ్యాప్తి చెందింది వీళ్ళు ఇరువురూ ప్రేమలో వున్నారు.. పెద్దలు ఒప్పుకోవడంతో లేచిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అనే పుకారు.. అది ఆ నోటా ఈ నోటా పడి చివరికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది..

అమ్మాయిని కాలేజ్ మాన్పించి ఇంట్లో ఉంచారు..
అబ్బాయి ఈ పుకార్లు తట్టుకోలేక దూరంగా వెళ్ళాలి అనే తపనతో అమెరికా చెక్కేసాడు..

మూడు సంవత్సరాలు గడిచాయి.. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు.. ఆ విషయం తెలుసుకొని  అబ్బాయి ఆ అమ్మాయిని వదులుకునే ఉద్దేశ్యం లేక ఇంటికి వొచ్చేసాడు .. ఇంకా చెప్పాలంటే దూరంగా వున్న ఈ 3 సంవత్సరాలు తనపై ప్రేమ రెట్టింపు అయింది..

మంచి ఉద్యోగం వుంది అన్న ధైర్యంతో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి అడగటం జరిగింది.. మొదట ఒప్పుకోలేదు కానీ డబ్బు ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు..
అదే డబ్బు లేకుండా వుంది ఉంటే ఇంకో 3 సంవత్సరాలు ప్రేమలో వున్నా ఒప్పుకునేవారు కాదేమో..

తర్వాత తెలిసింది.. ప్రేమ ఎంత వున్నా డబ్బుదే ఆధిపత్యం అని..


                                                                                                           రచన

                                                                                                         -  రఘు





















Sunday 13 January 2019

నేను నిరుద్యోగిని..🚶🚶



నేను నిరుద్యోగిని..!

ఈ నిరుద్యోగి అనే మాట అని, విని అలవాటైపోయింది..
ఈ ఒక్క పదం ఎన్నో ప్రేమ జంటలను విడదీసింది..
ఎన్నో చిచ్చులకు ఆద్యం పోసింది..
ఇంకా చెప్పాలంటే ఉద్యోగికి, నిరుద్యోగికి ఒక్క అక్షరమే తేడా, కానీ ఆ ఒక్క అక్షరపు విలువు..
నేలాఖర్లో డబ్బుల కోసం ఎదురుచూసేంత..
పక్కింటోళ్లతో మాటపడేంత..
ఒంటరితనానికి దగ్గరచేసేంత ఖరీదైనది..

మనం పెరుగుతున్నా కొద్దీ ఏవి అబద్ధాలో, ఏవి నిజాలో తెలుసుకోగలిగే సామర్థ్యం వస్తుంది మనకు..అందులో ముందుగా మనం అర్థం చేసుకునేది ఈ ఉపాధ్యాయులు చెప్పే అబద్ధాలే..
మొదట్లో 10 వ తరగతి లో మంచి మార్కులు వొస్తే చాలు లోకాన్ని జయించినట్టే  అన్నట్టు ముక్తకంఠంగా చెబుతారు..

ఇంటర్ కి వెళ్ళాక హాస్టల్ లో వేసి చేపని రుద్దినట్టు రుద్ది ఇంటరే కీలకమంటారు..
ఇంటర్ పాసై తొడగొట్టే లోపే నేనున్నానంటూ మీసం మెలేస్తుంది డిగ్రీ..
ఆఖరు డిగ్రీ ( ఇంజనీరింగ్ ) ఇక్కడా ఇదే మాట 10 వ తరగతి,ఇంటర్ మార్కులు అవసరమే లేదంటారు..డిగ్రీనే తోపంటారు..అంతమాత్రాని పై రెండు చదవటం ఎందుకో..

గుండ్రంగా తిరిగే భూమి గురించి..
అప్పు తీసుకోమని ప్రోత్సహించే లెక్కల గురించి..
చెట్ల గురించి, చరిత్రల గురించి..
అవయవాల గురించి, ఆవశ్యకతల గురించి తేలుసుకోవడానికే  20 సంవత్సరాలు పడితే..
ఇంకా ఎంజాయ్ చెయ్యడానికి టైమ్ ఎక్కడుంది..

లెక్కలు అప్పు చెయ్యడం  ఎలానో నేర్పిస్తుంటే..
"లా" నేమో అప్పు చేస్తే శిక్షించటం నేర్పిస్తుంది..

ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు అర్థం కాక అర్థం చేసుకోటానికి ఖాళీగా వుండేవారికి లోకం " " నిరుద్యోగి " అని బిరుదునిస్తుంది..

ఈ 20 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం, 2 నెలలు మైత్రివనం లో కోచింగ్ తీసుకొని సంపాదించే ఉద్యోగమంత, చుట్టుపక్కల వాళ్ళు గొప్పగా చెప్పుకునే మాటలంత, ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల ముందు భయం లేకుండా తిరిగే ధైర్యమంత..

ఇక ఈ నిరుద్యోగ దైనందిన జీవితం ఎలా ఉంటుందంటే..
ఉదయాన్నే 10 గంటలకు లేవడం..తిరగడం ,సినిమాలు చూడడం, ఫోనులో చాటింగ్ లు, సోల్లు కబుర్లు, మధ్యాహ్నం తినడం..మళ్ళీ సాయంత్రం టీ తాగడం మళ్ళీ రాత్రి భోజనానికి సిద్ధమవ్వటం..తిరిగి సినిమాలు.. ఇలాగే జీవితం బద్ధకంగా ఒళ్ళువిరుచుకునే అవసరం లేకుండా సాపీగా సాగిపోతుంటుంది..

ఇక ఉద్యోగం సంపాదించడంలో మొదటి ప్రక్రియ అయిన ఇంటర్వ్యూ విషయానికొస్తే..
కొంతమంది ఇదే నరకం..
కొంతమందికి ఇదే భయం..
కొంతమందికి ఇదే జీవితం..
కేవలం EXPERIANCE ఉన్న వారికే జాబు అంటారు..కానీ ఫ్రెషేర్స్ కి మాత్రం జాబ్ ఎవరు ఇవ్వరు..నాకు అర్థం కాక అడుగుతా freshers కి జాబ్ ఇవ్వకుండా ఉంటే అసలు experiance ఎలా వస్తుందో..

ఇలాంటి కష్టాలు పడి ఎలాగో జాబు సంపాదిస్తే చివరికి ఈ నిరుద్యోగం అంకం పూర్తవుతుంది.. తర్వాత పెళ్లి అనే అంకం మొదలవుతుంది..

                                              - రఘు




Friday 28 December 2018

raaja


                      అర్జున్ రెడ్డి  -  రాజా ది గ్రేట్ - రాజుగారి గది 2


అర్జున్ రెడ్డి - కోపం ఎక్కువ వున్న వ్యక్తి..
ప్రీతి - అర్జున్ రెడ్డి లవర్
శివ - అర్జున్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్

రాజా - అంధుడు.. కళ్ళు కనపడకపోయినా అన్నింటిలో ట్రైన్ అయిన వ్యక్తి... నోటి దురద  కూడా కొంచెం ఎక్కువే..

శ్రీనివాస్  - రాజా బెస్ట్ ఫ్రెండ్

రుద్ర - మెంటలిస్ట్...  పేస్ చూసి ప్రాబ్లెమ్ ఏంటో చెప్పగల ఒక వ్యక్తి..ఆ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యగలిగిన వ్యక్తి కూడా..

ఈ మూడు సినిమాలలోని పాత్రలను ఆధారంగా తీసుకొని నేను రాసుకున్న ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ కథ..



 ఇక కథలోకి వెలితే...

అంధుడైన రాజా , అతని స్నేహితుడు శ్రీనివాస్ ఇద్దరూ ఒక రద్దీగా వున్న రోడ్డు లో నడుచుకుంటూ వెళ్తుంటారు ఒకరోజు..

ఏంట్రా నీకు దారిచూపించే కర్రని తీసుకొని రాలేదు ఇవాళ..
అరే దాన్ని  కర్ర అనరు  white cane అంటారు..

నేను మాత్రం చేతి కర్ర అంటాను కానీ ఎందుకు తీసుకురాలేదు చెప్పు..
ఏం వుంది రోజు నువ్వు చెప్పినట్టు ఆ కర్రని పట్టుకొనే చస్తున్నా కదా ఇవాళ అది లేకుండా నడవటం ట్రై చేద్దాం అని వొచ్చా..

మరి ఆ ముఖానికి మాస్క్ ఏంటి ??
పొల్యూషన్ రా పొల్యూషన్ వలన ఇట్లా మాస్క్ లు వేసుకొని నడవాల్సి వస్తుంది..
సరే రోడ్డు చాలా రద్దీగా వుంది చూసి నడువు..

శ్రీనివాస్ అలా చెపుతున్నాడో లేదో పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న అర్జున్ రెడ్డి లవర్  ప్రీతి కి  డాష్ ఇచ్చాడు రాజా..
దానితో ప్రీతీ  వెనక్కు తిరిగి ఏరా ఎదవ కళ్ళు కనపడటం లేదా ??
రాజా - అవునండి మీకు ఎలా తెలుసు.. మీరు ఏమైనా సహాయం చేస్తారా ఏంటి ?? 😀😀

ప్రీతి - నేను ఎవరో నీకు తెలియదు నీకు
రాజా- నీ గురించి తెలుసుకోవడం నాకు  పనా ఏంటి, వెళ్లి పనిచూసుకో పాప
           అని హుహుహూహూ అంటూ వెటకారంగా నవ్వుతాడు..

స్పెక్ట్స్ పెట్టుకోవడం వలన రాజా ని అంధుడు అనుకోలేదు షాలిని.. కావాలనే డాష్ ఇచ్చాడు, ఏడిపించాడు అనుకోని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది..

శ్రీనివాస్ - ఎంత పని చేసావ్ రా రాజా ఆ అమ్మాయి ఎవరో తెలుసా అర్జున్ రెడ్డి లవర్ అతని గురించి చాలానే వున్నా అసలే వాడికి కోపం ఎక్కువ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో.. ! నువ్వు కొన్ని రోజులు బయట తిరగటం మంచిది కాదు..

కట్ చేస్తే

ఒక విశాలమైన నాలుగు అంతస్తుల భవనం...! గర్ల్స్ హాస్టల్ అనుకుంటా అది, అమ్మాయిల బట్టలు లోపల తీగల మీద ఆరేసి ఉంటే బయట అమ్మాయిల కోసం వారి లవర్స్ వెయిట్ చేస్తున్నారు..

ఎప్పటిలాగానే అర్జున్, ప్రీతీ కోసం హాస్టల్ కి వస్తాడు.. హాస్టల్ గేటు బయట వున్న మెట్ల మీద అందరూ ఎదో ఆందోళనగా  వుంటారు..

వారిని చూసిన అర్జున్ రెడ్డి ప్రీతీ ఎక్కడుంది, లోపల ఉందా, అవును మీరు అందరు ఎందుకు ఎదో పోగొట్టుకున్నోళ్లలాగా అట్లా కూర్చున్నారు..

అక్కడ కూర్చున్న అమ్మాయిలలో ఒకరు అది ప్రీతి మరేమో... అంటూ తడబడుతుంది.

ఏమైంది ప్రీతీ కి

ఎవడో ప్రీతీని ఏడిపించాడు అంట

 ఎవడు వాడు

ఏమో తెలియదు

ఇప్పుడు ప్రీతీ ఎక్కడుంది..

వెనుక గ్రౌండ్ లో

అర్జున్ రెడ్డి పరుగు లాంటి నడకతో ప్రీతీ దగ్గరకు వెళ్తాడు.. అప్పటికే ప్రీతి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది..

ప్రీతి మీ ఫ్రెండ్స్ చెప్పింది నిజమేనా ఎవరు  నిన్ను  ఏడిపించింది..
పచ్చిగా చెప్పు ప్రీతీ ఏం జరిగిందో..

ప్రీతీ జరిగింది మొత్తం చెప్పి ఏడ్చుకుంటూ వాడు కావాలనే ఏడిపించాడు నన్ను అంటూ ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసి చెపుతుంది..

కోపంగా ప్రీతీ ని తన బండి మీద ఎక్కించుకొని బయలుదేరాడు మధ్యలో ఆగి ఒక దగ్గర ఆ ఏడిపించిన వాడిని కొట్టడానికి ఒక బ్యాట్

40 నిమిషాల తర్వాత ప్రీతీ  వెళ్లిన ఏరియా కి వెళ్లి ఎవడ్రా మా-----ద్  నా ప్రీతీ ని ఏడిపించింది, ఎవడ్రా వాడు అంటూ కోపంతో రగిలిపోతున్నాడు.. కనపడిన వారందరిని  కొడుతున్నాడు ( మాస్క్ వేసుకోవడం వలన రాజా ముఖాన్ని ప్రీతి చూడలేదు )..

కట్ చేస్తే చిన్న క్లినిక్ లో ఒక డాక్టర్ పేషెంట్ నాడి చూస్తున్నాడు.. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది.. ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి హలో అంటాడు డాక్టర్..

అవతలి వైపు నుండి  రేయ్ శివ ఎక్కడ వున్నావ్..

నీ యవ్వ ఎక్కడుంటర నేను క్లినిక్ లో బే..

రేయ్ ప్రీతిని ఎవడో ఏదియూపించాడు అంటూ అర్జున్ మా ఏరియా కి వొచ్చి యిక్కడ అందరిని కొడుతున్నాడు..

నువ్వు త్వరగా రా..

వస్తున్నా ఆగు అంటూ  తన స్కూటీ ఏసుకొని బయలుదేరుతాడు శివ...

అర్ధగంటలో అక్కడకు వెళ్లి రేయ్ అర్జున్ ఆగరా ఎవరో తెలియకుండా మనం ఎట్లా కనిపెడతాం ఇట్లా అందరిని కొట్టుకుంటూ పొతే సమస్య పరిస్కారం కాదు కొత్త సమస్యలు వస్తాయి..

నీకు తెలియదు రా శివా నువ్వు ప్రీతీ ఏడవడం చూడలేదురా చూసుంటే ఇలా మాట్లాడే వాడివి కాదు..

అరేయ్ నాకు మొత్తం తెలుసురా ప్రీతీని ఏడిపించిన వాడిని నేను వెతికి పట్టుకుంటాను నా మాట విను..

నువ్వు కనిపెడతావా ఎలారా ??

ఎలా అయినా కనిపెడతారా, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పడతారా అందరు మనల్నే చూస్తున్నారు..































Sunday 23 December 2018

ఆకాష్ 💓 భూమి - 2


       
మీకు పెళ్ళయిపోయిందా మరి ఆ రోజు బస్ స్టాప్ లో ఎందుకు చెప్పలేదు... 

అది నా ఇష్టం.. 

ఒక్కమాటతో ఆశ మొత్తం ఒక్క పదాన్ని జతచేసుకొని నిరాశ అయిపొయింది.. హృదయం కొంచెం బరువెక్కినట్టు అనిపించింది,  కానీ పగిలిపోనందుకు కొంచెం ఆనందం అనిపించింది... 

ఇక భూమిని చూడలేక అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాను.. 


                                                 సమాప్తం 
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
 ఆగండి అయిపొయింది అనుకోని క్లోజ్ చెయ్యకండి.. తెలుగు కథలు కానీ సినిమాలు కానీ ఇలా అసంపూర్ణంగా ముగిసిపోతే మన తెలుగు ప్రేక్షకులకు నచ్చవు కదా.. అసలు కథ ఇప్పుడే మొదలయింది..

10 రోజుల క్రితం..

ఒక డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ... వాస్తు మీద నమ్మకం ఎక్కువ అనుకుంటా పక్కా వాస్తు ప్రకారంగా,

ఈశాన్య దిశగా పూజగది..
దక్షణ దిశలో బెదురూమ్..
పడమటి దిక్కున ఏర్పాటు చేయబడిన ఖరీదైన డైనింగ్ టేబుల్..

సమయం ఉదయం 10 గంటలు..

విశాలమైన హాలునుండి ఏవో చిన్న, చిన్న గుసగుసలు వినబడటంతో ఆ శబ్దానికి కలలో చావు బ్రతుకుల మీద వున్న వాడు నిద్రనుండి లేచి ఆవలిస్తూ దక్షణ దిశగా వున్న బెడ్ రూమ్ నుండి బయటకు వొచ్చాడు ఆకాష్..

రారా ఆకాష్ ఇతన్ని గుర్తుపట్టావా.. మనం వైజాగ్ లో వున్నప్పుడు మన ఇంటి పక్కనే ఉండేవారు అదేరా ప్రకాశం అంకుల్.. ఈయన ఇప్పుడు హైద్రాబాద్ లోనే మాట్ని మోని నడుపుతున్నాడు.. నీ కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు.. అమ్మాయి పేరు భూమి అమ్మాయి చాలా పద్దతిగా వుంది..  నువ్వు అంటుంటావు కదా సాంప్రదాయంగా ఉండాలి అమ్మాయి అంటే అని అలాగే వుంది..

నీకు నచ్చుతుంది అనే నమ్మకంతో వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాం.. అంది ఆకాష్ వాళ్ళ అమ్మ..

ఒక్కసారి ఈ ఫోటో చూడు అంటూ చేతికిచ్చింది..

ఫోటో చూడగానే ఆనందంతో గుండె ఉప్పొంగిపోయింది..

గోవింద, గోవింద సినిమాలో సిరివెన్నెల గారు రాసినట్టు.. పూల రెక్కలు,కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఓ బొమ్మ చేస్తివో అన్నట్లు నిజంగా స్వర్గం నుండి పొరపాటున భూమికొచ్చిన అప్సరసలా వుంది భూమి..

వెంటనే అమ్మ దగ్గర నుండి భూమి వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని కాల్ చేశాను..

కొంచెం క్యూరియాసిటీ

కాల్ రింగ్ అవ్వుతుంది ఎవరు లిఫ్ట్ చెయ్యలేదు..

ఇంకా క్యూరియాసిటీ పెరిగింది..
మళ్ళీ ట్రై చేశా రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేశారు అటు నుండి హలో అని గంభీరమైన గొంతు వినబడింది..

అంకుల్ నా పేరు ఆకాష్ నక్షత్రాల రావు గారి అబ్బాయిని..

హా చెప్పు బాబు నాన్న గారు ఇందాకే నీ గురించి చెప్పారు ..

అంకుల్ మీ అమ్మాయి భూమి నాకు చాలా బాగా నచ్చింది..

చాలా సంతోషం బాబు .. మీ ఫోటో కూడా ప్రకాశం మాకు చూపించాడు మా అందరికి కూడా నువ్వు నచ్చావు.. ఇక భూమి చూడటమే తరువాయి..

ఇప్పుడు మీరు ఎలాగో మా భూమి నచ్చింది అన్నారు గనుక ఈ సంబంధం ఖాయం అయినట్టే మా అమ్మాయికి కూడా నీ ఫోటో చూపించి మీ గురించి చెపుతాను..

అంకుల్ మీ అమ్మాయికి చెప్పొద్దు ఫోటో కూడా చూపించొద్దు.. ఒక తెలియని వ్యక్తిగా వెళ్లి మీ అమ్మాయిని ఆటపట్టిస్తాను.. పెళ్లయిన తర్వాత తలుచుకున్నప్పుడు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.. ప్లీజ్ అంకుల్..

ఓకే  బాబు అలానే కానివ్వు..

రెండు గంటల తర్వాత బయట నుండి వస్తుంది భూమి..

భూమి ఇప్పుడే నీకు ఒక సంబంధం వొచ్చింది.. అబ్బాయి చాలా మంచివాడు,అందగాడు ఇదిగో ఫోటో అంటూ భూమికి ఆకాష్ ఫోటో ఇచ్చాడు..

మొదటి చూపులోనే భూమికి కూడా ఆకాష్ నచ్చాడు.. అన్నట్టు చెప్పటం మర్చిపోయా అబ్బాయి తన గురించి చెప్పొద్దు అన్నాడు తానేదో తెలియని వ్యక్తిగా వొచ్చి నిన్ను ఆట పట్టిస్తా అన్నాడు..

కానీ నీకు అసలే నోటి దురద, నువ్వు కొట్టినా కొడతావు అందుకే ముందే నీకు చెప్తున్నా.. మధుర జ్ఞాపకం ఉండకపోయినా పరవాలేదు గాని చేదు జ్ఞాపకంగా మిగలకూడదు అని చెప్తున్నా..

 నన్ను ఆటపట్టిస్తావా చెప్తా  అనుకుంది భూమి మనసులో..


ఇది FLASHBACK..


15 రోజుల తర్వాత

ఆకాష్ కోపంతో భూమి ఇంటికి వొచ్చి  భూమి వాళ్ళ నాన్న ని అరుస్తున్నాడు..

పెళ్లయిన అమ్మాయిని మళ్ళీ నాకు ఇచ్చి పెళ్ళిచేద్దాం అనుకుంటున్నారా అని..

అంతలో భూమి అక్కడకు వొచ్చింది ..

భూమి వాళ్ళ నాన్న ఏం చెప్పావే ఆకాష్  కి ఇంతలా అరుస్తున్నాడు..

పెళ్ళయిపోయిందని చెప్పా..

ఎందుకలా చెప్పావు..

నన్ను ఆట పట్టించడానికి వొచ్చాడు కదా, అందుకే చిన్న జలక్ ఇచ్చి నేనే అతన్ని ఆటపట్టించా పెళ్లయిపోయింది అని..

ఆకాష్- అది విని, అంటే నీకు పెళ్లవలేదా ..

భూమి -నన్ను చుస్తే నీకు పెళ్లయిన అమ్మాయిలా కనపడుతున్నానా..  పెళ్లి కాలేదు..

ఆకాష్ - భూమి చేసింది తలచుకొని తనలో తానూ నవ్వుకున్నాడు..


                                                                                      రచన

                                                                                     -  రఘు


















Saturday 15 December 2018

టైటిల్ చెప్పండి


ఈ కథకి టైటిల్ ఏమి ఇవ్వలేదు.. దీనికి సరిపోయే టైటిల్ ని మీరే సూచించగలరు..



పోలీస్ హెడ్ క్వాటర్స్..

సమయం ఉదయం  8 గంటలు..

వసంత్,ఈశ్వర్,గణేష్..ముగ్గురు విసుగ్గా పోలీస్ క్వార్టర్స్ భవంతి ముందు పచార్లు చేస్తున్నారు.

గణేష్ :- ఏంట్రా ?? హెడ్ ఇంత ఉదయాన్నే రమ్మన్నాడు అసలే హ్యాంగౌర్ తో తల మొత్తం పట్టేసినట్టుంది..నిద్రతో కళ్ళు మూసుకుపోతున్నాయి.

వసంత్ :- రాత్రి మొత్తం తాగుకుంటు కూర్చుంటే అలానే ఉంటుంది..ఏదైనా importent matter వుంటే  తప్ప కబురుపెట్టడు కదా మహానుభావుడు?.

ఈశ్వర్ :- మళ్ళీ ఏ కేసుని తగిలించబోతున్నాడో ఏమో మన మెడకి ??

వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే..

హెడ్ కారు క్వార్టర్స్ ముందు వొచ్చి ఆగింది..అందులో నుండి ఎదో టెన్షన్ తో ఫోన్ మాట్లాడుతూ హెడ్ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు..

ముగ్గురూ సెల్యూట్ చేశారు.. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెల్తూ చేతితో సైగ చేసాడు లోపలికి రమ్మనట్టు.

టేబుల్ కి ఒక వైపు హెడ్ ,తల మీద చెయ్యి వేసుకోని దివాలుగా కూర్చొని వున్నాడు.. ఈ ముగ్గురు టేబుల్ కి ఇవతలవైపు కూర్చొని వున్నారు..

గణేష్ - ఏంటి సార్ తలనొప్పా ??

హెడ్ - ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే తలనొప్పి కాదు తలే పగిలెట్టుగా ఉంది..

గణేష్ - ఏమైంది సార్..హ్యాంగోవరా ?

హెడ్ :- 4 రోజుల క్రితం ట్రైన్ లో లాప్టాప్ పోయింది అనుకుంటూ ఒకడు కంప్లైంట్ ఇచ్చాడు..

కేస్ ఫైల్ చేశాం..

గణేష్ - కంపదీసి ఇప్పుడు ఆ లాప్టాప్ ని వెతికి పట్టుకోవాలా ఏంటి  సార్ ??

హెడ్ - గణేష్ నేను చెప్పేది విను ఇది చాలా క్లిష్టకరమైన కేసు, అలా కామెడీ గా తీసుకునేది కాదు,తర్వాత అదే రోజు ఇంకొకడు వొచ్చాడు లాప్టాప్ పోయింది అనుకుంటూ ?? అలా అలా కేసులు వస్తూనే వున్నాయి గత రెండు రోజుల్లో వోచిన కంప్లైంట్స్ ఇవి అంటూ షీట్ అందించాడు.

మొత్తం 2 రోజుల్లో ముప్పైకి పైగా దొంగతనాలు చేశారు ,చేస్తూనే ఉన్నారు..ఇంకా కేసులు వస్తూనే వున్నాయి..

అన్నింటిలోనూ కామన్ పాయింట్ ఒకటి ఉంది అది ఏంటి అంటే వీళ్ళు పోయినవి అని కంప్లైంట్ చేసిన లాప్టాప్ లు అన్ని ట్రైన్ లలో  దొంగిలించబడినవే..

ఈశ్వర్ :- మరి వీళ్ళు ఏం చేస్తున్నారు దొంగతనం చేస్తుంటే నిద్రపోతున్నారా??

హెడ్ :- అవును నిజంగానే నిద్రపోయారు ??
         వీళ్ళు అందరూ చెప్పినది ఏంటి అంటే తెలియకుండానే మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నాం లేచేసారికే బ్యాగ్ అందులో లాప్టాప్ అన్ని పోతున్నాయి అని.

ముగ్గురూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు..

గణేష్ - ..అవును వాటిని ip అడ్రస్ ఏవో ఉంటాయి కదా అవి ఎక్కడుంటాయో తెలుసుకోవటానికి..

హెడ్ :- ఒకొక్కటి ఒక్కో ప్రదేశంలో ఉన్నట్టు నిర్దారణ అయింది.. ఎవరో వీటన్నింటి గురించి తెలిసిన వాడే ఇది చేస్తున్నాడు..

గణేష్ : - ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను మాట్లాడాలి..

హెడ్ :- ఏర్పాటు చేయిస్తాను

2 గంటల తర్వాత..

35 - 40 సంవత్సరాల మధ్య వయస్కుడు లోపలకి వొచ్చాడు..వీరి టీం ఎదురుగా ఉంది..గణేష్ ఇంట్రాగేషన్ మొదలుపెట్టాడు..మిగతా టైం లో ఎంత కామెడీగా వున్నా ఇంట్రగేషన్ లో మాత్రం తన లోని పోలీసు ఆఫీసర్ బయటకు వస్తాడు..

గణేష్ - మీరేనా లాప్టాప్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చింది..
- అవును సార్ ..

గణేష్ - బాగా గుర్తుతెచ్చుకొని చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో..
- ఎప్పటిలాగానే ట్రైన్ లో వెళ్తున్నా..బ్యాగ్ ని పైన లగేజీ స్టాండ్స్ మీద పెట్టేసా అందులోనే లాప్టాప్ కూడా ఉంది??

సుమారు గంట తర్వాత వేడి వేడి పల్లిలు అనుకుంటూ పల్లీలు అమ్ముకుంటూ ఒక ముసలి వ్యక్తి వొచ్చాడు..పల్లీలు తీసుకోమన్నాడు వొద్దన్నాను.

టేస్ట్ చేసిన తర్వాతనే తీసుకోండి అంటూ వొద్దంటున్నా కొన్ని చేతిలో పెట్టాడు అవి తిన్నాను..తర్వాత 5 నిమిషాల తర్వాత మత్తుగా నిద్రపట్టినట్టుంది..మళ్ళీ మెలుకువ వొచ్చేసారికే గంటకు పైగా అయింది అంతలోనే బ్యాగ్ పోయింది..

అక్కడ మీకు ఎవరైనా అనుమాదాస్పదంగా కనపడ్డారా ??

అలా ఎవరు కనపడ లేదు సార్.

ఇక మీరు వెళ్ళొచ్చు.

ఇంకొక వ్యక్తి ని పిలిపించారు..సమోసా అనుకుంటూ 30 సంవత్సరాల వ్యక్తి వొచ్చాడు. సమోసాలు తీసుకున్నాను తర్వాత నిద్రలోకి జారుకున్నాను..లేచేసారికే లాప్టాప్ మాయం అయిపోయింది..

అందారు ఇలాగే చెప్తున్నారు అంటే ఆ పల్లీలలో సమోసాలలో, మత్తుమందు లాంటిది కలిపి వీళ్ళకి ఇచ్చి ప్లాన్ తో దొంగతనాలు చేస్తున్నారు..కానీ ఆ అమ్మేవాళ్ళు మాత్రం ఒకడు ముసలి వాడు,మరొకడు గుడ్డివాడు,మరొకడు 30 సంవత్సరాల యువకుడు..

ట్రైన్ లో అమ్ముకునే వారిని పిలిచి ఆరతీస్తే..

గణేష్ - పొట్ట కూటి కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు వాళ్ళు అలా చెయ్యరు ఇది పక్క ప్లాన్ తో చేసేవే.

ఈశ్వర్ :- అంటే వీళ్ళందరు ఒకే గ్యాంగ్ అంటావా??

గణేష్ :- కావొచ్చు ? ఎదో గుర్తొచ్చిన వాడిలా హెడ్ తో సార్ మీకు గుర్తుందో ఇలాంటి కేసుని మనం 2 సంవత్సరాల ముందు ఒకటి ఇన్వెస్టిగేట్ చేసాము..కానీ ఒక్కడే వ్యక్తి ఇలానే మత్తుమందు కలిపి ఫోన్ లు దొంగతనం చేసేవాడు..

ఈశ్వర్ :- కానీ వాడు ఒక్కడే కదా??

గణేష్ :- వాడు ఒక్కడే కావొచ్చు కానీ వాటికి వీటికి ఒక్కటే తేడా అక్కడ ఒకడు ఇక్కడ మాత్రం వేర్వేరు వ్యక్తులు అక్కడ ఫోన్ లు అయితే ఇక్కడ లాప్టాప్ లు అంతే తేడా ??

వాడిని పట్టుకుంటే కేస్ లో క్లూ దొరికినట్టే అనుకున్నారు..

గణేష్ :- సార్ వాడి ఫోటో ఎక్కడ ఉంది..ఫోటో ని తీసుకొని వాడిని వెతకడం మొదలుపెట్టారు చివరికి రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే పట్టుకున్నారు..

ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్ లో బల్ల మీద ,పక్కనే ఉన్న ఛైర్స్ మీద టీం మొత్తం కూర్చొని ఉంది.

గణేష్ :- చెప్పరా?? లాప్టాప్ లు ఎక్కడ ..
- ఏం లాప్టాప్ లు
- నువ్వు దొంగతనం చేసినవి??
- మీరు ఎవర్ని అనుకోని ఎవర్ని పట్టుకున్నారో ఒక సారి చెక్ చేసుకోండి..
- చెంప చెల్లు మనేలా ఒక్కటి పీకాడు..
అంతలో డోర్ దగ్గర ఎదో వినికిడి చూస్తే లాయర్,ఇంకొక ఇద్దరు వ్యక్తులు అదర బదరా నడుచుకుంటూ లోపలికి వొచ్చారు..క్రింద ఉన్న వ్యక్తిని చూసి లాయర్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు ఇతన్ని కొట్టింది అని గట్టిగా అరిచాడు..

నువ్వు ఎవర్ని అరెస్టు చేసావో తెలుసా?? ఎవరిమీద చెయ్యి వేశావో తెలుసా ??

అతను ఎవరునుకున్నావు ??
KR ఇండస్ట్రీస్,KR ట్రావెల్స్,KR హాస్పిటల్స్ ఛైర్మెన్ KR పేరు విన్నావా?? ఆయనే ఇతను KR

కొన్ని వేల కోట్లకు అధిపతి అలాంటి వ్యక్తి ముష్టి లాప్టాప్ లని దొంగతనం చెయ్యటం ఏమిటి..??

తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేశారు అని మీ మీద కోర్ట్ లో కేసు వేస్తా??

మీ ఉద్యోగాలు పీకిస్తా..

వెంటనే హెడ్ వెళ్లి KR కి సారీ చెప్పి ఇంకా ఎప్పుడు ఇలా జరగదు అని బ్రతిమాలారు..

KR పోలీసుల మీద నమ్మకంతో చిరునవ్వు నవ్వి వెనుతిరిగాడు..


అందరూ కూర్చొని మౌనంగా వున్నారు..

గణేష్ - మనం రెండు సంవత్సరాల క్రితం అరెస్ట్ చేసింది ఇతన్నే కదా ?? రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇంట్రగేషన్ కూడా చేశాం..

వీడి ఫోటో నే కదా ఇన్ని రోజులు మన స్టేషన్ లో గోడకి దొంగల ఫోటో ల పక్కన వేలాడుతూ ఉంది.

వసంత్ :- అవును వీడినే ??

గణేష్ :- మరి ఇప్పుడు ఏంట్రా ఎదో KR అంటున్నారు ,తప్పు చేసావు అంటున్నారు,కోర్ట్ అంటున్నారు..

దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందని నాకు అనిపిస్తుంది..

ఈశ్వర్ :- ఇతని లాగానే ఇంకొకడు ఉన్నాడేమో ?

హెడ్ :- అవన్నీ సినిమాల్లోనే జరుగుతుంటాయి..నిజజీవితంలో కాదు..

అందరూ ఇంటికి వెళ్తారు ఏం అర్థం కాదు గణేష్ కి ఇంట్లో కూర్చొని TV చూస్తున్నాడు కానీ ఆలోచన మొత్తం ఆ దొంగమీదనే తిరుగుతుంది..

సుడిగాడు సినిమా వస్తుంది..అందులో మూరళి మోహన్ మాస్క్ తీసి అల్లరి నరేష్ లా కనపడుతాడు..

సడన్ గా గణేష్ కి స్ట్రైక్ అవుతుంది ఎదో విషయాన్ని కనుక్కున్న వాడిలా వెంటనే వసంత్ కి ఈశ్వర్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా కలవాలి రమ్మంటాడు..ఫోన్ లో చూపిస్తాడు ఇలా చేసే అవకాశం ఏమైనా ఉంది అంటారా??

వసంత్ :- ఛాన్స్ లేనేలేదు అది అంతా సినిమాలో జరిగేవి బయట అలాంటివి జరిగే అవకాశమే లేదు..

గణేష్ :- వసంత్ మనం పోలీసులం దేని మీద అనుమానం వొచ్చిన వెంటనే నిర్దారణ చేసుకోవాలి.. చిన్న క్యూ కూడా మనకు చాలా అవసరం..

ఈ సిటీలో ఫేమస్ ఫేస్ ట్రాన్స్మిషన్ స్పెషలిస్ట్ ఎవరో కనుక్కోండి..అంతే కాకుండా సిటీలో దొంగతనం చేసిన సామాన్లను కొనే ఎదవలు ఎక్కడ వుంటారో కనుక్కోండి..

తర్వాత రోజు..

  డాక్టర్ దగ్గరకు వెళ్తారు..డాక్టర్ పేరు శర్మ..

హలో శర్మ గారు
I am ganesh -  మిమ్మల్ని ఒక విషయం అడుగుతాం.ఆ వీడియో చూపించి ఇలా మనిషి ఒక ముఖంతో ఒక స్కిన్ లాంటి మాస్క్ ని తయారు చేసి వేరే మనిషి దానిని use చేసే అవకాశం ఉందా..

ఉంది..ఆ అవకాశం , కానీ ఇలాంటి ఫేస్ చేంజెస్ ఏం జరిగినా మా హాస్పిటల్ లో నే జరగాలి..ఈ సిటీలో వేరే స్పెషలిస్ట్ లేరు దీనికి..

గణేష్ - అయితే ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి ముఖాన్ని మీరు ఎవరికైనా తయారు చేశారా??

డాక్టర్ :- లేదు సార్..

బాగా గుర్తు తెచ్చుకోండి..మర్చిపోయి వుంటారు..

నిజం సార్ ఈ ముఖాన్ని ఇప్పుడే మొదటి సారి చూడటం..

డాక్టర్ కి థాంక్స్ చెప్పి ముగ్గురు బయటకు వొచ్చారు..

ఈశ్వర్ :- ఉన్న ఒక్క ఆశ పోయింది..


గణేష్ :- దొంగ లాప్టాప్ లు కొనే వాడి గురించి కనుక్కోమని చెప్పాను కనుక్కున్నావా??

హా ఇదిగో ఫోటో వీడి పేరు సయ్యద్..ఈ సిటీలో దొంగలించిన పెద్ద సరుకు ఏదైనా వీడే కొనేది..

ఇప్పుడు వీడు ఎక్కడ ఉంటాడు.. --------            ( అడ్రస్)

అడ్రెస్ కి వెళ్లి వాడిని పట్టుకుంటారు..

గత నాలుగు అయిదు రోజుల్లో ఎక్కువ మొత్తంలో లాప్టాప్ లు తీసుకొని ఎవరైనా వోచారా??

లేదు సార్..రెండు పీకుతారు చెప్పు రా అని..

నిజం సార్ మీరు ఎంత కొట్టినా నేను చెప్పేది ఒక్కటే ఎవరు రాలేదు అని..

చేసేది ఏమి లేక పోలీస్ లు వెనక్కి వెళ్తుంటారు..కొంచెం దూరం వెళ్ళాక పాన్ షాప్ వాడు సార్ 1000 రూపాయలు ఇస్తే ఇన్ఫర్మేషన్ చెపుతా..

1000 రూపాయలు ఇస్తారు..వాడు రోజు వీడిని ---- ఈ ప్లేస్ లో కలుస్తాడు.. మీరు అక్కడకి రాత్రి 7 గంటలకు వెళ్తే వాడు దొరుకుతాడు..

ఈ విషయం నీకు ఎలా తెలుసు ??

మందు ప్రభావం సార్ రాత్రే వాడితో సిట్టింగ్ వేసిన మొత్తం చెప్పాడు కొడుకు..

అక్కడకు వెళ్తారు వాడు లాప్టాప్ లు అందిస్తుంటే పట్టుకుంటారు..పట్టుకొని చెప్పారా ఇంకా మీ గ్యాంగ్ ఎక్కడ ఉందో అని చిత్ర హింసలు పెడుతుంటారు..

వాడు చెప్తాడు..గ్యాంగ్ ఎవరు లేరు సార్ నేనె సార్.. వేరే వేరే గెటప్ లు మారుస్తూ అనుమానం రాకుండా వెళ్తుంటాను..

మీరు ఆల్రెడీ నన్ను ఫోన్ ల దొంగతనం కేసులో పట్టుకున్నారు..

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి గానే కదా రా అప్పుడు నువ్వు దొంగతనాలు చేసింది..

అవును సార్ ఇతనే..

మరి ఈ ఫేస్ ఈ విషయం ఏంటి ?? ఏ సిటీలో ఏ హాస్పిటల్ లో చేయించుకున్నావ్??

ఈ సిటీ లొనే సార్ డాక్టర్ శర్మ గారు చేశారు..

శర్మ నా ??ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు..

మరి మేము అతన్ని ఎంక్విరీ చేస్తే నేను చెయ్యలేదు ఎవరికి అని చెప్పాడు..

అతను చెప్పడు సార్ ఎందుకంటే ఇదంతా చేయించేది అతనే..

ఇలా ఫేస్ లు మార్చి మాతో దొంగతనాలు చేయిస్తుంటాడు..ఈ సిటీలోనే కాదు బయట సిటీలలో కూడా ఇలానే ఎవరికి అనుమానం రాకుండా చేయించి వోచిన డబ్బులో 70 % తీసుకుంటాడు..ఒక దొంగతనాలే కాదు సెటిల్ మెంట్లు,స్మగ్లింగ్ ఇలా అన్ని..

మరి KR  కి తెలియదా తన పేస్ తో ఇవన్నీ చేస్తుంటే..

తెలుసు ?
తెలుసా....

ఇదంతా ఒక దందా లాగా సార్..

  దందా ఏంటో తర్వాత తెలుసుకుందాం..

                                                              -  రఘు

Wednesday 14 November 2018

ఆకాష్ - భూమి



మధ్యాహ్నం 01:00  గం .. 

         ఎక్కడో పైన ఆకాశంలో వున్న సూర్యుని ప్రభావానికి కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో వున్న భూమి వేడితో ఊగిపోతోంది.. మనం అనుకుంటాం కానీ మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే వారిలో ముందు ఉండేది సూర్యుడే. 

అనగనగా సిటీలో ఒక బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురుచూసే వారందరూ ఆ ఎండని తట్టుకోలేక బస్ షల్టర్ లో తలదాచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. చూస్తుండగానే జనసంచారం ఎక్కువ అయింది.. ఆ జనసమూహం మధ్యలో ఆకుపచ్చ రంగు పరికిణి  ధరించిన అమ్మాయి ఆ వేడిని తట్టుకోలేక తన ముఖానికి అడ్డంగా పరిచిన చున్నీ ( స్కార్ఫ్ ) ని తీసింది.. 

ఆ చున్నీ ని తీసి తలను అటు ఇటు విదిలిస్తుంటే ఆ దాటికి అప్రయత్నంగా కదులుతున్న ఆమె కురులు నాట్యం చేస్తున్నట్టుగా కనపడుతున్నాయి.. 

నిశ్చలత్వానికి ప్రతీకల్లాంటి కనులు.. 
శంకాల్లాంటి చెవులకు సైతం ఆకర్షణీయతను జోడించే ఝంకాలు.. 
అందమైన ఆమె నుదిటి మీద మరింత రమణీయమైన కుంకుమ.. 
ఆ ఎండకు తాను పెట్టుకున్న కుంకుమ మీద నుండి స్వేద బిందువులు జారుతుంటే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనబడుతుంది.. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె high heals అవసరం లేనంత ఎత్తు.. mack up ( మేకప్ ) అవసరం లేనంత కలర్.. 

ఇక ఆ స్కార్ఫ్ ని విప్పిన దగ్గర నుండి ఒక్కో అబ్బాయి తినేసేలా చూస్తున్నారు.. అప్పుడు వారి మనస్సులో ఏం రన్ అవుతుందో నేను చెప్పనవసరం లేదు అది మీ ఊహకే వదిలేస్తున్నాను.. 

టైం 01:05 -  

             సరిగ్గా అప్పుడే అక్కడకు వొచ్చాడు ఒక అబ్బాయి ఆ అమ్మాయి కన్నా ఒక 2 అంగుళాలు ఎత్తే, వొచ్చి ఆ అమ్మాయి ఎదురుగా నిలుచున్నాడు ధ్వజస్తంభంలా.. బస్ కోసం కాదు బస్ స్టాప్ లో నిలుచున్న ఆ అమ్మాయి కోసం.. 

అబ్బాయి  - EXCUSE ME మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి.. 

అమ్మాయి - ఎవరు నువ్వు ?? నాతొ ఏం మాట్లాడాలి..                      ( విసుగ్గా )

అబ్బాయి - నా పేరు ఆకాష్ చాలా రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.. 

అమ్మాయి - గమనిస్తున్నా..!
                 -   ఎందుకు ఫాలో అవుతున్నావ్ ?? 

ఆకాష్ - మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను.. బహుశా మిమ్మల్ని లవ్ చేస్తున్నానేమో అని డౌట్ గా వుంది.. 

అమ్మాయి - చిన్న నవ్వు నవ్వి నా పేరు - భూమి 
                - నీ పేరు ఎదో అన్నావ్?? 

ఆకాష్ -  ఆకాష్ 

భూమి  -      ఆకాష్,భూమి   పైన ఆకాశం కింద భూమి తెలుసు కదా అవి ఎప్పటికీ కలవవు అని.. మనం కూడా  అంతే.. 

ఆకాష్ - కలవక పోవొచ్చు కానీ భూమికి ఎన్ని కోరికలు వున్నా అవి తీర్చేది మాత్రం ఆకాశం నుండి వొచ్చే వర్షమే కదా...!

భూమి - ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావ్ ??                           < అంది విసుగ్గా >

ఆకాష్ - కొత్తగా చెప్పటానికి ఏం లేదు మా అబ్బాయిలందరూ దశాబ్దాలుగా మీ అమ్మాయిలకు చెపుతున్నదే.. 

అదే  -  ఐ లవ్ యూ 

         -  నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. 

        - main tumse pyar karta hoon   అని ఏవో చెపుతుంటారు కదా అదే నేను చెప్పాలనుకుంటున్నాను..                 ( బస్ స్టాప్ లో వున్న అబ్బాయిలందరూ చప్పట్లు కొట్టారు ). 

భూమి - అయితే నేను కూడా కొత్తగా చెప్పటానికి ఏం లేదు మా అమ్మాయిలందరూ దశాబ్దాలుగా మీ అబ్బాయిలకు చెపుతున్నదే.. 

 అదే - sorry 

         -  నేను నిన్ను ఫ్రెండ్ గానే చూశాను  

         - అని ఏమో చెపుతారు కదా అదే నేను కూడా చెప్తున్నాను.. ( బస్ స్టాప్ లో వున్న అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టారు ). 

ఆకాష్ - AS EXPEXTED..!   మీ అమ్మాయిలందరూ ఇదే చెపుతారు కదా. 

భూమి - నో చెపుతాం, ఛీ కొడతాం అని తెలిసి కూడా చెప్పడం దేనికి.. అది కూడా అందరిముందు.. 

ఆకాష్ - ప్రపోజ్ చెయ్యటం మా హక్కు 
             నో అనడం మీ అలవాటు 
             నో అన్న మీతోనే చివరకు yes  చెప్పించుకోవటం మా పద్దతి.. 
             అలవాటును మార్చుకోవొచ్చు కొంచెం కష్టపడితే, కానీ హక్కును మార్చాలంటే కష్టం .. 

భూమి -  సరే..! నీకిిచ్చిన టైం అయిపోయింది..                                           నాకు టైమ్ అవుతుంది వెళ్ళాలి.. 
              ఇంతకీ చెప్పడం మర్చిపోయా మేము నో  చెప్పగానే మందు గ్లాసులు చేతిలో పట్టుకొని గడ్డాలు పెంచటం మీ అబ్బాయిలకు అలవాటు కదా అలా చెయ్యకు చెండాలంగా .. 

ఆకాష్ - పెళ్లి అయింది అని తెలియటానికి సింబాలిక్ గా అమ్మాయిలకు మెట్టెలు,పుస్తెలు ఎలానో లవ్ ఫెయిల్యూర్ అని తెలియటానికి అబ్బాయిలకు సింబాలిక్ గా గడ్డం అలాగ .. 


TIME - 01:15 ని.లు 


అంతలో బస్ రావటంతో భూమి వెళ్ళిపోయింది.. ఆకాష్ అక్కడే నిల్చొని భూమిని తీసుకెళ్లిన బస్సు వైపు చూస్తున్నాడు.. 

బస్సు ఎక్కిన భూమికి వెనుక వున్న అమ్మాయిల మాటలు చెవిన పడ్డాయి..           ( అబ్బాయి చాలా బావున్నాడు, ఆ ప్రపోసల్ కి ఎవరైనా పడిపోవాల్సిందే అదే నాకు చెపితే ఎగిరి గంతు  వేసే దాన్నే అంటూ మాట్లాడుకుంటున్నారు)

ఆ మాటలు విన్న భూమి పెదాల అంచున చిన్న చిరునవ్వు,ముఖంలో చిన్నపాటి సిగ్గు ప్రత్యక్షమయ్యాయి అవి సహజం.. 

భూమికి ఆ రోజు నిద్ర పట్టలేదు ఆ బస్సు లో విన్న మాటలే గుర్తొస్తున్నాయి.. 

చూస్తుండగానే కాలగమనంలో వారం రోజులు గడిచిపోయాయి.. భూమి రోజు బస్ స్టాప్ లో ఆకాష్ కోసం ఎదురుచూసేది కానీ కనపడలేదు.. 

వారం రోజుల తర్వాత 

సందులేకుండా జాగింగ్ చేస్తున్న పార్కులో ఆ రోజు భూమి కూడా జాగింగ్ కి వొచ్చింది.. అక్కడ జాగింగ్ చేస్తున్న భూమి దగ్గరకు ఆకాష్ వొచ్చి నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా.. 

భూమి - నువ్వు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నావా ఆలోచించటానికి ఇంకోసారి కనబడితే మా husband  కి చెపుతాను.. 

             --    ఏంటి మీకు పెళ్ళైపోయిందాదాదా   --


 పెళ్లి అయిపోయిందా కాలేదా ?? ఒకవేళ పెళ్లి అయితే బస్ స్టాప్ లో ఎందుకు చెప్పలేదు ఆ విషయం.. ??


అసలు ఏం జరిగుంటుంది ?? 

తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..( ఇంకా వుంది )


                                                                                                                                                                రచన 
                                                                                                                                                              -  రఘు 


























ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts