Thursday 25 July 2019

ఛాయ్ విలేజ్


సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా చల్లగాలికి వెల్దామని బయటకు వెళ్తే అక్కడ 'ఛాయ్ విలేజ్' అనే బోర్డు ఒకటి కనపడింది. ఆ పేరు చూడగానే నాకు ఒక ఆలోచన వొచ్చింది.. ఆ ఆలోచన నుండి అక్షర రూపంలో బయటకు వొచ్చినదే ఈ ఛాయ్ విలేజ్..



ఆ ఊరు 'టీ'కి ప్రత్యేకం..'టీ' కే ప్రత్యేకం..అందుకే ఊరి పొలిమేర దగ్గర ఛాయ్ విలేజ్ ముఖద్వారానికి రెండు వైపులా 10 అడుగుల ఎత్తులో ఫ్లాస్క్ ని పోలిన స్తంభాలు ఉంటాయి..ఆ స్తంభాలపైన మసీదు పై కప్పుతో పోలిన ఆకారంలో 'ఛాయ్ విలేజ్' అని సిమెంట్ అక్షరాలతో రాసి ఉన్న ముఖద్వారం స్వాగతం పలుకుతుంది. ఊరి లోపల చిన్న చిన్న ఇళ్ళు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. రోడ్డు వెంబడి చెట్ల కింద ఏర్పాటు చేయబడిన చక్కని టీ కప్పు ఆకారపు కుర్చీలు, కాఫీ రంగు అద్దుకొని దర్శనమిస్తుంటాయి ఛాయ్ విలేజ్ లో. ఆ ఊరి నైపుణ్యం చెప్పడానికి, వారి అలవాట్లను తెలుసుకోవడానికి ఈ కుర్చీల అల్లికే ఒక ఉదాహరణ. అన్నట్లు చెప్పడం మరిచాను ఈ ఊరిలో కొంతమందికి టీ ల పేర్లు, మరికొంతమందికి కాఫీ ల పేర్లు ఉంటాయి. ఇది ఇక్కడ సర్వ సాధారణం మరి.

తెలుగిళ్ళలో భోజన సమయంలో ఆవకాయ, కూర, చారు, పెరుగు లాంటి లొట్టలేసుకుంటు తినే రకాలు ఉన్నట్లు..ఆ ఊరిలో కూడా ఆస్వాదిస్తూ తాగే ఐదు రకాల 'టీ' లు ఆ ఛాయ్ విలేజ్ ప్రత్యేకత.  4వ శతాబ్దంలో 'టీ' ని కనిపెట్టిన చైనా వైద్యుడే ఆ ఊరి గుళ్లలో కొలువుండే దేవుడంటే అతిశయోక్తి కాదు.  ఇక పండగ వొచ్చిందంటే గుమగుమలాడే మసాలా ఛాయ్ లు, నోరూరించే అల్లం 'టీ' ల గురించి చెప్పాల్సిన పనే లేదు.. అలాంటి ఛాయ్ విలేజ్ లో కూడా ఒక ప్రేమ కథ ఉంది.. నీటిని మరిగించి మరిగించి టేస్ట్ కోసం ఎదురుచూసే 'టీ' సాంప్రదాయం ఆ ఊరి ప్రజలు తాగే టీ ల వల్ల వంటబట్టింది అనుకుంటా..అందుకే వారు ప్రేమించుకుంటూ, హద్దులను మించుకుంటూ వారి కమ్మనైన కాఫీ లాంటి ప్రేమను తమ తల్లిదండ్రులకు చెప్పడానికి ఎదురుచుస్తూనే వున్నారు.

ఇలాంటి విచిత్రపు ఊరిలో ప్రేమ కథా అనుకుంటున్నారా?? దానికి 'టీ' కి ఉన్నంత చరిత్ర ఉంది.  కొన్ని సంవత్సరాల క్రితం.. ఫ్లాష్ బ్యాగ్ అనగానే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో స్క్రీన్ ఒకటి ఓపెన్ అయ్యి, ఏమని చెప్పాలి.. ఎవరు పేరు చెపితే..అలాంటివి ఏమి లేవు కానీ.. ఈ ప్రేమ కథలో హీరోగా చెప్పుకోబడే ఊలాంగ్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఛాయ్ విలేజ్ ప్రత్యేకతను విని చూడటానికి వొచ్చారు.. వొచ్చి చూసిపోకుండా ఇక్కడే స్థిరపడి హీరోయిన్ గా చెప్పుకుంటున్న బ్లాక్ టీ ( హీరోయిన్ పేరే బ్లాక్ టీ ) వారి తాగి చూడరా రుచి అనే కాఫీ షాపుకి ఎదురుగానే అమృతపు రుచి మీ సొంతం కాఫీ షాపును మొదలెట్టారు.
అప్పటికే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగే తాగి చూడరా రుచి షాపు వీరి రాకతో మూడు పువ్వులు మూడు కాయలుగా మారింది. ఎదురెదురు షాపుల మధ్య పోటీ నెలకొంటే..ఎదురెదురుగా ఉంటున్న ఊలాంగ్, బ్లాక్ టీ మధ్య ప్రేమ పుట్టింది. ఇక ఛాయ్ విలేజ్ ప్రత్యేకత రోజు రోజుకు పక్క రాష్టాలకు కూడా పాకుతూ పోతుంది.. దీంతో ఛాయ్ విలేజ్ లోనే పెద్దవారిగా పేరు తెచ్చుకున్న ఈ ఎదురెదురు షాపుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి. పక్క రాష్టాల నుండి వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు ఈ ఛాయ్ విలేజ్ కి తరలి రావడం మొదలయింది.. తమ రాష్టాలలో కూడా ఎన్నో వందల కాఫీ షాపులు వున్నా, ఆ షాపుల్లో ఒక్క కాఫీకి వందలకు వందలు వసూలు చేస్తున్నా వాటన్నింటిని వొదిలి ఈ ఊరి ఛాయ్ తాగాలని, ఈ ఊరి వాళ్ళతో ఒక ఛాయ్ షాపు పెట్టించాలని కాచుకుకూర్చున్న వారెందరో..

ఇలా ఛాయ్ విలేజ్ కీర్తి, ప్రతిష్టలు పక్క దేశాలకు కూడా పాకుతుండగానే.. ఏడాదికొకసారి ఛాయ్ విలేజ్ జరుపుకునే  భళా ఛాయ్ ఉత్సవం వొచ్చింది..సంవత్సరానికి ఒకసారి వొచ్చే ఈ ఉత్సవాన్ని ఈ ఊరి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.. విచిత్రం ఏంటంటే.. ఏడాది పొడవునా రకరకాల టీ లు వుండే ఈ ఊరిలో..ఆ రోజు మాత్రం టీ వాసన కూడా కనపడదు..
గంటలు గడుస్తున్నా కొద్ది ఉత్సవం ఊపు జోరందుకుంది..పగలు మొత్తం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన వారు..రాత్రి కాగానే ఆ కాలక్షేపానికి తోడు ఖరీదైన బాటీల్లతో జత కట్టి సిప్పు, సిప్పులో స్వర్గాన్ని వెతుక్కుంటున్నారు. సరిగ్గా అప్పుడే దూరంగా ఉన్న గడియారం 8 గంటలు కొట్టింది.. తాగిన మైకంలో గడియారం శబ్ధం కర్నకఠోరంగా వినపడిందో ఏమో కాని.. కోపంతో పంచ కట్టుకున్న స్థూలకాయుడు ఒకడు లేచి కోపంగా ఆ శబ్ధం చేసిన గడియారం వైపు బయలుదేరాడు.. గడియారం దగ్గరకి చేరుకొని దాన్ని పగలగొట్టడానికి చేతిలో పెట్టుకోగానే..అతనికి సన్నని గునుగుడు ఒకటి ఆ పక్కనే ఉన్న ఇంటి నుండి వినపడింది.. వెంటనే తొంగి చూసాడు.

ఈ ఉత్సవంలో సంబంధం లేకుండా ఊలాంగ్, బ్లాక్ టీ లు ప్రయివేట్ గా మాట్లాడుకోవడం పబ్లిక్ గా బయటపడింది. అందులోనూ చూసిన స్థూలకాయుడు బ్లాక్ టీ వాళ్ళ నాన్న మరి.  దీంతో ఆ ఊరిలో రావణకాష్టం మొదలయింది.. సలసల మరిగే టీ, పొగలు కక్కినట్టు.. ఇరు కుటుంబాల పెద్దలు కోపంతో నిప్పులు కక్కారు.
వీళ్ళు పెళ్లి అన్నారు..
వాళ్ళు పగ అన్నారు..
వీళ్ళు ప్రేమించుకున్నాం అన్నారు..
వాళ్ళు మర్చిపోండి అన్నారు.
ప్రేమ ఏమైనా మర్చిపోటానికి ఒక వస్తువా ??  టీ ఎడిక్ట్ అయినట్లు వాళ్ళ మనసులలో ప్రేమ ఎడిక్ట్ అయిపోయింది మరి. ఊపందుకున్న ఉత్సవం కాస్త వాడివేడిగా ముగిసింది.

మరుసటి రోజు... వేకువజామున పక్క గ్రామల నుండి వొచ్చిన కొన్ని వందల లీటర్ల పాలను పెద్ద గంగాళం లాంటి పాత్రలో వేడిచేస్తూ వున్నారు ఆఊరి వాళ్ళు.. ఉదయం కావున..రాత్రి మొత్తం సేద తీరిన సల సల మరిగిపోయే డికాసిన్( నలుపు రంగు లో ఉంటుంది) తెల్లవారగానే తనకు అందాన్ని ఇచ్చే పాలకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఇరు ఇళ్లలో ఉన్న ప్రేమికులు ఒకరినొకరు చూసుకోవడాని, కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు.

కాలగమనంలో రోజులు చిరుతలా పరిగెడుతున్నాయి.. ఈ ఛాయ్ విలేజ్ లో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. వంద కుటుంబాలు వున్నా ఏ ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ ఆస్తులు కానీ స్థలాలు కానీ లేవు.. వారికి ఉన్న ఆస్థి అల్లా ఒక్క ఈ ఛాయ్ విలేజ్.. అందులో ఒకే కుటుంబంలా వుండే మనుషుల ఆప్యాయతలే.. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటుంది.. ఆస్తులు లేవు.. భూములు లేవు మరి వారి బ్రతుకుతెరువు ఏంటి?? వారికి సంపాదన ఎలా అనే విషయం గురించి..

సంపాదన.. ఇది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు మితిమీరి మరీ సంపాదిస్తుంటే..మరికొందరు రోజులు గడిస్తే చాలు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సంపాదిస్తుంటారు.. దీన్నే పరిమిత సంపాదన, అపరిమిత సంపాదన అంటారు. ఈ పరిమిత సంపాదన, అపరిమిత సంపాదనలు కూడా రెండు కోణాల్లో ఉంటాయి..
అంబానీని మనం చూసి అపరిమితంగా డబ్బు సంపాదిస్తున్నాడు అనుకుంటాం..ఇది ఒక కోణం..కానీ అంబానీ కోణంలో మాత్రం తాను సంపాదించే సంపాదనకు రెట్టింపు చెయ్యాలి..ఇంకా నేను పరిమితంగానే సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నాడేమో ఇది ఇంకో కోణం..
ఇక ఛాయ్ విలేజ్ సంపాదన విషయానికి వస్తే.. ఛాయ్ విలేజ్ కు దక్షిణ దిక్కున 8 కిలోమీటర్ల దూరంలో దూద్లా అనే పట్టణం ఉంది.. విజయనగరం అంత పెద్ద పట్టణం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి.. ఛాయ్ విలేజ్ లో వుండే 100 కుటుంబాల్లో 70 కుటుంబాలు ఈ ఛాయ్ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ 70 కుటుంబాల్లో 30 కుటుంబాలు ఈ పట్టణానికి వొచ్చి ఛాయ్ అమ్ముకుంటారు..
మిగిలిన కుటుంబాలు కూడా ఇలానే పక్క నన్ను పట్టణాలకు, పెద్ద గ్రామాలకు వెళ్లి ఛాయ్ అమ్ముకుంటు జీవనం సాగిస్తుంటారు. వీరందరు ఛాయ్ అమ్మే దగ్గర ఒకటే బోర్డు ఉంటుంది.. ఇది ఛాయ్ విలేజ్ షాపు. అని ఆ పదం చాలు రోజుకు ఛాయ్ అమ్మగా 300 లాభం రావటానికి.. ఆ లాభం చాలు ఆ ఊరి వాళ్ళకి సంతోషంగా బ్రతకడానికి. ఇదే వీరి వృత్తి..

ఛాయ్ విలేజ్ కి పెద్ద మనుషులయినా, ప్రత్యర్థులైన ఆ రెండు కుటుంబాలే.. ఆ రెండు కుటుంబాల హవా సాగుతున్న ఆ ఊరిలో మూడవ వ్యక్తి అడుగు పడింది..ఆ అడుగుతో ఊరు అట్టుడుకిపోయింది..

తర్వాత ఏం జరిగిందో ఛాయ్ విలేజ్ సెకండ్ ఎపిసోడ్ లో చూద్దాం..

Thursday 14 February 2019

వాలెంటైన్స్ డే ప్రేమ కథ


అటు మెట్రో స్టేషన్ ముద్దులకు,ఇటు భజరంగ్ దళ్ యొక్క నియమాలకు సంబంధం లేకుండా భలే లవ్ స్టోరీ కదా అని పాఠకులు తమ మనస్సులో అనుకోవడానికి చేస్తున్న ఒక చిరు ప్రేమ  ప్రయత్నం ఇది..

ఇది ప్రేమ కథే కానీ దేవదాసు, పార్వతి ప్రేమ కథ లాంటిది మాత్రం కాదు అయినా ప్రేమ గురించి మాట్లాడితే దేవదేసు.పార్వతి ప్రేమ కథని ఉదాహరణగా చెపుతారు ఏంటి వాళ్ళ ప్రేమ కథని లవ్ ఫెయిల్యూర్ కి ఉదాహరణగా చెప్పాలి కానీ..

సరే, విషయానికి వొస్తే.. 

ఒక మారుమూల పల్లెటూరు.. అది పల్లెటూరే కదా అని తీసిపడేయకండి ఒక సంఘటన 10 శాతం జరిగితే దానిని వారి క్రియేటివిటీ తో 90 శాతం కల్పించి చెప్పేంత వేగం ఆ ఊరి సొంతం.. ఆ ఊరి ముందు టీవీ 9 కూడా సరితూగదు..

ఇద్దరు అబ్బాయిలు కలిసి తిరిగితే తాగుబోతులు..
అదే ఒక అమ్మాయి, అబ్బాయి  మాట్లాడుకుంటే వారి మధ్య ప్రేమ వుంది అనుకునేంత కఠినమైన మనుషులు అక్కడ కోకొల్లలు..

ఇలాంటి చరిత్ర కలిగిన ఊరికి భయపడి తన ఇష్టాలను, ఆనందాలను దూరం చేసుకొని స్నేహితులను విడిచి ఒంటరి తానాన్ని తన మజిలీగా,మౌనాన్ని తన స్నేహితుడుగా చేసుకున్న ఒక యువకుని ప్రేమ కథ ఇది..

ఎన్ని ద్వేషాలు, పగలు వున్నా ఊరిలో జరిగే వేడుకలను అందరు కలసి  చేసుకోవడం ఆ ఊరికున్న ఒక మంచి లక్షణం.. ఆ మంచి లక్షణమే ముందు,ముందు మన హీరో ప్రేమకు కారణం అవుతుంది.. సంవత్సరంలో ఒక అమావాస్య రోజున ఆ చీకటిలో అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఏర్పాటు చేసిన నాటకాన్ని చూస్తూ ఆ రాత్రి మొత్తం జాగారం చేస్తుంటారు..

అమావాస్య మీద చందమామ అలిగి చీకటిని చాపలా భూమి మీద పరిచి తానూ మబ్బుల చాటుకు పోయిన ఆ అమావాస్యపు మసక చీకటిలో నాకు పౌర్ణమిని పరిచయం చేసిన ఒక అందమైన అమ్మాయిని చూశాను.. చూడటం ఏంటి అనుకోకుండా యురేనియం లాంటి నేను న్యూక్లియర్ లాంటి కటిక చీకటిలో న్యూట్రాన్ లాంటి తనను బలంగా ఢీకొట్టడం వలన నాలో అమెరీషియం లాంటి ప్రేమ పుట్టింది.. 

22 సంవత్సరాలు మౌనంతో స్నేహం చేస్తున్న నాకు ఇకపై ప్రేమని భాగస్వామిగా చేసుకోవాలనే కోరిక పుట్టింది..

ప్రేమ..!  రెండు అక్షారాల పదం 
               సఫలమైతే మూడు అక్షరాల ఆనందం 
                విఫలమైతే మూడు అక్షరాల విచారం 

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో  ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేదు.. నాలో ఆ ప్రేమని పరిచయం చేసిన అమ్మాయి పేరు అకీర.. మనం రోజు చూస్తున్న అమ్మాయే ఒక్కోసారి అందంగా కనపడుతుంది,ఒక్కోసారి మాములుగా కనపడుతుంది.. నేను చిన్న తనం నుండి తనని చూస్తూనే వున్నాను కానీ ఆ రోజు దీపాల కాంతుల్లో చందమామలా కనపడింది.. అలా నాలో ప్రేమ పుట్టింది.

మన ఊరి సంగతి అగమ్యగోచరం..
మరి తనతో ఎలా మాట్లాడాలి..
ఎలా నా ఫీలింగ్స్ ని ఆమెతో పంచుకోవాలి.. రోజులు గడుస్తున్నాయి దేని మీద ద్రుష్టి కేంద్రీకరించపోతున్నాను..

ఒక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నాకు ఫేస్బుక్ లో ఆమె పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ తో ఛాన్స్ వెతుక్కుంటూ వొచ్చింది.. ( ఆమె అప్పుడే ఫేస్బుక్  వాడటం మొదలుపెట్టింది).. అలా తన ఇష్టాఇష్టాలను తెలుసుకున్నాను.. రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత ఒక వాలెంటైన్స్ డే రోజున తన మీద ప్రేమని బయట పెట్టడం జరిగింది...

తన దగ్గర నుండి ఏ రెస్పాన్స్ లేదు.. మెసేజ్ లు , ఫోన్ లు అన్ని బ్యాండ్..

INFACT  బ్లాక్ చేసిని అని చెప్పొచ్చు.. అలా రోజులు దారుణంగా గడుస్తున్నాయి

ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తను ఊరిలో ఒక ఫంక్షన్ లో ఎదురుపడింది..

ప్రేమ విషయం ప్రస్తావించకుండా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నాను.. మేము మాట్లాడుకోవడం చూసి అంతలోనే వార్త ఊరి నలుదిశలా వ్యాప్తి చెందింది వీళ్ళు ఇరువురూ ప్రేమలో వున్నారు.. పెద్దలు ఒప్పుకోవడంతో లేచిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అనే పుకారు.. అది ఆ నోటా ఈ నోటా పడి చివరికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది..

అమ్మాయిని కాలేజ్ మాన్పించి ఇంట్లో ఉంచారు..
అబ్బాయి ఈ పుకార్లు తట్టుకోలేక దూరంగా వెళ్ళాలి అనే తపనతో అమెరికా చెక్కేసాడు..

మూడు సంవత్సరాలు గడిచాయి.. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు.. ఆ విషయం తెలుసుకొని  అబ్బాయి ఆ అమ్మాయిని వదులుకునే ఉద్దేశ్యం లేక ఇంటికి వొచ్చేసాడు .. ఇంకా చెప్పాలంటే దూరంగా వున్న ఈ 3 సంవత్సరాలు తనపై ప్రేమ రెట్టింపు అయింది..

మంచి ఉద్యోగం వుంది అన్న ధైర్యంతో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి అడగటం జరిగింది.. మొదట ఒప్పుకోలేదు కానీ డబ్బు ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు..
అదే డబ్బు లేకుండా వుంది ఉంటే ఇంకో 3 సంవత్సరాలు ప్రేమలో వున్నా ఒప్పుకునేవారు కాదేమో..

తర్వాత తెలిసింది.. ప్రేమ ఎంత వున్నా డబ్బుదే ఆధిపత్యం అని..


                                                                                                           రచన

                                                                                                         -  రఘు





















Sunday 13 January 2019

నేను నిరుద్యోగిని..🚶🚶



నేను నిరుద్యోగిని..!

ఈ నిరుద్యోగి అనే మాట అని, విని అలవాటైపోయింది..
ఈ ఒక్క పదం ఎన్నో ప్రేమ జంటలను విడదీసింది..
ఎన్నో చిచ్చులకు ఆద్యం పోసింది..
ఇంకా చెప్పాలంటే ఉద్యోగికి, నిరుద్యోగికి ఒక్క అక్షరమే తేడా, కానీ ఆ ఒక్క అక్షరపు విలువు..
నేలాఖర్లో డబ్బుల కోసం ఎదురుచూసేంత..
పక్కింటోళ్లతో మాటపడేంత..
ఒంటరితనానికి దగ్గరచేసేంత ఖరీదైనది..

మనం పెరుగుతున్నా కొద్దీ ఏవి అబద్ధాలో, ఏవి నిజాలో తెలుసుకోగలిగే సామర్థ్యం వస్తుంది మనకు..అందులో ముందుగా మనం అర్థం చేసుకునేది ఈ ఉపాధ్యాయులు చెప్పే అబద్ధాలే..
మొదట్లో 10 వ తరగతి లో మంచి మార్కులు వొస్తే చాలు లోకాన్ని జయించినట్టే  అన్నట్టు ముక్తకంఠంగా చెబుతారు..

ఇంటర్ కి వెళ్ళాక హాస్టల్ లో వేసి చేపని రుద్దినట్టు రుద్ది ఇంటరే కీలకమంటారు..
ఇంటర్ పాసై తొడగొట్టే లోపే నేనున్నానంటూ మీసం మెలేస్తుంది డిగ్రీ..
ఆఖరు డిగ్రీ ( ఇంజనీరింగ్ ) ఇక్కడా ఇదే మాట 10 వ తరగతి,ఇంటర్ మార్కులు అవసరమే లేదంటారు..డిగ్రీనే తోపంటారు..అంతమాత్రాని పై రెండు చదవటం ఎందుకో..

గుండ్రంగా తిరిగే భూమి గురించి..
అప్పు తీసుకోమని ప్రోత్సహించే లెక్కల గురించి..
చెట్ల గురించి, చరిత్రల గురించి..
అవయవాల గురించి, ఆవశ్యకతల గురించి తేలుసుకోవడానికే  20 సంవత్సరాలు పడితే..
ఇంకా ఎంజాయ్ చెయ్యడానికి టైమ్ ఎక్కడుంది..

లెక్కలు అప్పు చెయ్యడం  ఎలానో నేర్పిస్తుంటే..
"లా" నేమో అప్పు చేస్తే శిక్షించటం నేర్పిస్తుంది..

ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు అర్థం కాక అర్థం చేసుకోటానికి ఖాళీగా వుండేవారికి లోకం " " నిరుద్యోగి " అని బిరుదునిస్తుంది..

ఈ 20 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం, 2 నెలలు మైత్రివనం లో కోచింగ్ తీసుకొని సంపాదించే ఉద్యోగమంత, చుట్టుపక్కల వాళ్ళు గొప్పగా చెప్పుకునే మాటలంత, ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల ముందు భయం లేకుండా తిరిగే ధైర్యమంత..

ఇక ఈ నిరుద్యోగ దైనందిన జీవితం ఎలా ఉంటుందంటే..
ఉదయాన్నే 10 గంటలకు లేవడం..తిరగడం ,సినిమాలు చూడడం, ఫోనులో చాటింగ్ లు, సోల్లు కబుర్లు, మధ్యాహ్నం తినడం..మళ్ళీ సాయంత్రం టీ తాగడం మళ్ళీ రాత్రి భోజనానికి సిద్ధమవ్వటం..తిరిగి సినిమాలు.. ఇలాగే జీవితం బద్ధకంగా ఒళ్ళువిరుచుకునే అవసరం లేకుండా సాపీగా సాగిపోతుంటుంది..

ఇక ఉద్యోగం సంపాదించడంలో మొదటి ప్రక్రియ అయిన ఇంటర్వ్యూ విషయానికొస్తే..
కొంతమంది ఇదే నరకం..
కొంతమందికి ఇదే భయం..
కొంతమందికి ఇదే జీవితం..
కేవలం EXPERIANCE ఉన్న వారికే జాబు అంటారు..కానీ ఫ్రెషేర్స్ కి మాత్రం జాబ్ ఎవరు ఇవ్వరు..నాకు అర్థం కాక అడుగుతా freshers కి జాబ్ ఇవ్వకుండా ఉంటే అసలు experiance ఎలా వస్తుందో..

ఇలాంటి కష్టాలు పడి ఎలాగో జాబు సంపాదిస్తే చివరికి ఈ నిరుద్యోగం అంకం పూర్తవుతుంది.. తర్వాత పెళ్లి అనే అంకం మొదలవుతుంది..

                                              - రఘు




ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts